నీ గురించి రాయడానికి నేనెంత
నీ ప్రేమ ముందు నా ఈ పదాలెంత
నా కలానికి చెప్పా కవితలా కూర్చమని మాటలని
నీకై నా చిన్ని చిన్ని పదాలని
కలలు నావే అయినా కన్నది నువ్వని
ఆ కలల తీరం చేరింది నేనే అయినా
నావలా నన్ను నడిపింది నీ నుండి వచ్చిన ధైర్యం అని
ఈ ప్రయాణంలో నాకోసం నువ్వు దాటిన సంద్రాలెన్నో
నన్ను సముద్రాలు దాటించడానికి
నువ్వు తట్టుకున్న అలజడులెన్నో
నా సంతోషానికై నువ్వు కార్చిన కన్నీరెంతో
నా ఎదుగుదలకై నువ్వు భరించిన ఎడబాటెంతో
అవి ఎవరికీ కనిపించవు నీ కొంగు చివరి అంచుకి తప్ప
ఏదేమైనా, ఎప్పటికీ చెరిగిపోకుండా
కష్టాల్లో నా ముఖంపై ఉండే చిరునవ్వు నీదే
కృంగిపోకుండా నా గుండె లోపల ఉండే తెగింపు నువ్విచ్చిందే
ఙ్ఞానం, గుణం, ధైర్యం నువ్వు నాకిచ్చిన అస్త్రాలైతే,
వాటినుంచి నేను గెలిచిన ప్రతి యుద్ధపు గెలుపు నీకే సొంతం, అంకితం…
✍🏻 Rajini Gajjela
కవితా సంపుటి
A voice of little woman