నిలకడల గదుల నుండి విడిన అడుగుల అల్లికలు
ఏదో కొత్త అనుభూతికి చేరువవుతున్న పాదాలు
ఒకవైపు ఎత్తుగా ఉండే భవనాలు
వాటికన్నా ఎత్తులో ఎగిరే విమానాలు
ఇంకోవైపు దూరంలో దాగున్న చెట్లూ, కొండలు
వాటిని తేటగా చూపించే నా కళ్లజోళ్లు
“ఎంతసేపు నడుస్తావ్, ఇలా రా”
అంటూ ఒక బల్ల నన్ను తనతో కూర్చోమంది.
దాని పక్కనే చెట్టు నేను నిండుగా నవ్వితే నాతో ఆడతానంటుంది
అటుగా వచ్చిన పిల్లగాలి నన్ను తాకి, ఆగి,
“కాసేపు ఇక్కడే ఉండిపో కదా, ఊసులాడుకుందాం” అంటుంది
కాళ్ళకి దగ్గరగా నదీ ప్రవాహం
చూసేందుకు నిశ్శబ్దంగా ఉన్నా
నాకు గట్టిగా ఏదో చెప్తోంది
ఎదురుగా నీటిపై కదిలే ఓడలు, పడవలు,
అందులో జనాలు, వారి ముఖాల్లోని భావాలు,
నా కళ్ళని అలా స్పృశిస్తున్నాయి
అలా కాసేపు..
ప్రకృతి తల్లి నన్ను తన ఒడిలో చేర్చుకుంది
నాలో మమేకమైపోయింది
నాతో మాట్లాడింది
నన్ను పలకరించింది
ఇలా పంచుకునేలా చేసింది
✍🏻 Rajini Gajjela
Leave a comment