నాకొక పాతికేళ్లు వచ్చాక నాన్న దగ్గరికెళ్ళి..
“కష్టంగా ఉంది నాన్న” అని చెప్పాలనిపించిన్నప్పుడు,
నాలోపలి నుండి నాకొక స్వరం వినిపించింది

“ఏదమ్మా కష్టం…

పదిహేనేళ్ళ వయసులోనే జీవితంలో ఏదో సాధించాలని
పొట్టచేతపట్టుకుని బయల్దేరిన
ఓ కుర్రాడి పట్టుదల కన్నానా…!

తనతో పాటు వెనుకబడిన సమాజం మారాలని,
ప్రగతి పథంలో పయనించాలని,  
బాల కార్మికుల కోసం   ఓ యువకుడు చేసిన నిరంతర పోరాటం కన్నానా…!

ఇబ్బందులు ఎన్ని ఎదురైన  పట్టు  విడువకుండా,
ప్రయత్నమే శ్వాసగా సాగిన
ఓ  మామూలు మనిషి కడగండ్ల కన్నానా..!

ఇద్దరయ్యి ఇరవయ్యేళ్ల వయసులోనే
అరవయ్యేల జీవిత పాఠాలని నేర్చుకున్న
ఓ సాధారణ వ్యక్తి ఇక్కట్ల కన్నానా …!

ముప్పై యేళ్ళొచ్చేసరికి,
భగవంతుడు భరించమని ముగ్గురు ఆడపిల్లలనిస్తే…
బరువుగా కాకుండా బాధ్యతగా స్వీకరించి,
సమాజం యొక్క మాలిన్యం అంటకుండా,
సంఘంలో తన గౌరవం పెరిగేలా పెంచిన…
నలబైయేళ్ల ఒక మధ్యతరగతి తండ్రి త్యాగం కన్నానా…!”



అంత గొప్ప వ్యక్తికి కూతుర్నైన నేను,
ఇంత చిన్న కష్టానికి చెమ్మగిల్లితే ఎలా అని,
కళ్ళు తుడుచుకుని, కవిత ముగించుకున్నాను.

✍🏻 Rajini Gajjela

Posted in

Leave a comment